బంగ్లాదేశ్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న షేక్ హసీనా వ్యతిరేక పోరాట యోధులు

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పతనంలో కీలక పాత్ర పోషించిన ఐదుగురు ప్రముఖ విద్యార్థి నేతలు ఇప్పుడు ఎన్నికల బరికి దూరమయ్యారు. ఉద్యమ సూత్రధారి మహఫూజ్ ఆలం సలహాదారు పదవికి రాజీనామా చేసినప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. మరోవైపు ఢాకా-8 నుంచి పోటీ చేయాలనుకున్న ఉస్మాన్ హాదీ దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది. ఈ పరిణామాలు విద్యార్థి నేతల రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.
యూనస్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన ఆసిఫ్ మహమూద్ ఎన్నికల ముందు తప్పుకోగా, ఎన్సీపీ-జమాత్ కూటమి సమీకరణాల వల్ల మహిళా నేత తస్నీమ్ జారా కూడా సైడ్ లైన్ అయ్యారు. టీవీల్లో ఉద్యమ గొంతుకగా నిలిచిన అబు బకర్ మజుందార్ కొత్త సంఘం పెట్టినా ఎన్నికల సీన్ లో కనిపించడం లేదు. వ్యవస్థను మార్చిన ఈ యువ నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎందుకు పాల్గొనడం లేదనేది ఇప్పుడు బంగ్లాదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి రాజకీయాలు మరియు అంతర్గత విభేదాల వల్లే వీరు రాజకీయంగా వెనుకబడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు.