భారత రక్షణ రంగంలో సంచలనం 79 వేల కోట్ల రక్షణ ఒప్పందాలకు భారీ ఆమోదం

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) సుమారు 79,000 కోట్ల రూపాయల రక్షణ కొనుగోలు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భారీ కేటాయింపులతో త్రివిధ దళాల పోరాట పటిమ గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా పినాక రాకెట్ వ్యవస్థ కోసం లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్లు మరియు శత్రు డ్రోన్లను గుర్తించే అత్యాధునిక డిటెక్షన్ సిస్టమ్స్ కొనుగోలు చేయడం ద్వారా భారత సైన్యం మరింత బలోపేతం కానుంది.
వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచేందుకు 200 కిలోమీటర్ల పరిధి గల ‘అస్త్ర మార్క్-2’ క్షిపణుల కొనుగోలుకు ఆమోదం లభించింది. వీటితో పాటు టి-90 ట్యాంకులు మరియు ఎంఐ-17 హెలికాప్టర్ల ఆధునీకరణ ద్వారా సరిహద్దు రక్షణ మరింత పటిష్టం కానుంది. శత్రు విమానాలు, డ్రోన్లను కూల్చివేసే మీడియం రేంజ్ క్షిపణుల (MR-SAM) రాకతో భారత గగనతల మరియు సముద్ర తీర రక్షణ కవచం అజేయంగా మారనుంది.