బ్రష్ చేసినా నోటి దుర్వాసన వస్తోందా ఇది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు జాగ్రత్త

రోజుకు రెండుసార్లు బ్రష్ చేసినప్పటికీ నోటి దుర్వాసన వేధిస్తుంటే దానిని సాధారణ సమస్యగా భావించి వదిలేయకండి. వైద్య పరిభాషలో దీనిని ‘హాలిటోసిస్’ అంటారు. నోటి దుర్వాసన రావడానికి 85 శాతం కారణం నోటిలోని బ్యాక్టీరియా అయినప్పటికీ, మిగిలిన 15 శాతం కారణాలు శరీర అంతర్గత వ్యాధులతో ముడిపడి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పళ్ల మధ్య ఉండే క్యావిటీలు లేదా చిగుళ్ల సమస్యలే కాకుండా నాలుకపై పేరుకుపోయిన పాచి కూడా దీనికి ప్రధాన కారణం.
కేవలం నోటి శుభ్రత మాత్రమే కాకుండా గ్యాస్, అజీర్తి, సైనస్ లేదా కిడ్నీ మరియు లివర్ సమస్యలు ఉన్నప్పుడు కూడా శ్వాసలో దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అలాగే శరీరంలో విటమిన్ల లోపం మరియు మధుమేహం వంటి కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. దీని నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ నాలుకను శుభ్రం చేసుకోవడంతో పాటు తగినంత నీరు త్రాగడం మరియు అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.