కోటి రూపాయల గంజాయిని ఎలుకలు తినేశాయి అందుకే నిందితుడు నిర్దోషిగా విడుదల

జార్ఖండ్‌లోని రాంచీలో ఒక విచిత్రమైన ఉదంతం వెలుగుచూసింది, ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒక భారీ గంజాయి స్మగ్లింగ్ కేసు నీరుగారిపోయింది. 2022లో ఓర్మాంజి పోలీసులు దాదాపు కోటి రూపాయల విలువైన 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇంద్రజిత్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని ఆధారంగా కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు. దీనితో ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
పోలీసు స్టేషన్ స్టోర్ రూమ్‌లో భద్రపరిచిన 200 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టుకు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధారాల భద్రత విషయంలో పోలీసుల వైఫల్యాన్ని తప్పుబట్టిన కోర్టు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసింది. పోలీసుల పర్యవేక్షణలో ఉన్న భారీ మొత్తంలో గంజాయి ఎలా మాయమైందనే అంశంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జార్ఖండ్ పోలీసు వ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది.