బోర్డర్ వద్ద హై అలర్ట్! బంగ్లాదేశ్ అలజడుల దృష్ట్యా సరిహద్దుల్లో భారీగా మోహరించిన భద్రతా దళాలు
December 21, 2025

బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత-బంగ్లా సరిహద్దుల్లో నిఘాను పెంచారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్ పోలీసులు, బిఎస్ఎఫ్ కలిసి సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు. జంగీపూర్ పోలీస్ సూపరింటెండెంట్ నేతృత్వంలో మోటార్ బైక్లు మరియు కాలి నడకన ఈ తనిఖీలు చేపట్టారు. పొరుగు దేశంలోని అశాంతి ప్రభావం భారత భూభాగంపై పడకుండా ఉండేందుకు అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు, మైమన్సింగ్లో దీపు చంద్ర దాస్ దారుణ హత్యను రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా ఖండించారు. పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ దీపును మూక దాడి చేసి చంపడాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఈ ఘటనల నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంది. అదనపు బలగాల పహారా కొనసాగుతోంది.