ఢిల్లీ మెట్రో స్టేషన్ నుండి వస్తుండగా యువకుడిని వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి వేళ ఒళ్లు గగుర్పొడిచే అనుభవం

ఢిల్లీలో మహిళల భద్రతపై ఆందోళనలు ఉన్నప్పటికీ, తాజాగా ఒక యువకుడికి ఎదురైన అనుభవం రాజధానిలో భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. గత వారం అర్ధరాత్రి మెట్రో స్టేషన్ నుండి ఇంటికి వెళ్తుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఆ యువకుడిని వెంబడించాడు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఆ వ్యక్తి తన వెంటే రావడం చూసి తీవ్ర భయాందోళనకు గురైన యువకుడు, వెంటనే తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ సురక్షితంగా కాలనీ గేటు లోపలికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి చివరి వరకు అతడి వైపు తీక్షణంగా చూస్తూనే ఉండటం గమనార్హం.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీలో రాత్రిపూట భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం మహిళలే కాకుండా పురుషులు కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నా, ఇలాంటి అభద్రతా భావం కలగడం ఇదే మొదటిసారి అని బాధితుడు పేర్కొన్నాడు. ఈ ఉదంతం నగరంలో రాత్రివేళ సామాన్యుల భద్రత ఎంత దారుణంగా ఉందో మరోసారి స్పష్టం చేస్తోంది.