రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కిరాతకం.. ప్రాణస్నేహితుడే యముడయ్యాడు

రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం కిరాతకం.. ప్రాణస్నేహితుడే యముడయ్యాడు

భద్రాద్రి కొత్తగూడెం: కట్టుకున్న వాళ్లే కాటేస్తున్నారు, ప్రాణ స్నేహితులే పగబడుతున్నారు. డబ్బు మీద ఆశ మనుషులను మృగాలుగా మారుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం బీమా సొమ్మును కాజేయడం కోసం తనతోనే ఉంటూ, తననే నమ్ముకున్న ఒక అమాయక యువకుడిని అంతమొందించేందుకు పక్కా స్కెచ్ వేశారు కిలాడీ స్నేహితులు.

అసలేం జరిగింది?

ఎటపాక మండలం గన్నవరానికి చెందిన కట్టా యశ్వంత్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాథగా మారిన అతడు తన మేనమామ వద్ద పెరుగుతూ, గత ఆరు నెలలుగా భద్రాచలానికి చెందిన కట్టా సాయిదీపక్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. సాయిదీపక్ అంటే యశ్వంత్‌కు ఎంతో నమ్మకం. కానీ ఆ నమ్మకమే అతడి ప్రాణాల మీదకు తెస్తుందని ఊహించలేకపోయాడు.

సాయిదీపక్‌కు భానుప్రకాష్ అనే ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరి కళ్లు యశ్వంత్ మీద పడ్డాయి. ఎలాగైనా భారీగా డబ్బు సంపాదించాలన్న దురాశతో ఒక కిరాతక పథకాన్ని రచించారు. గతేడాది నవంబర్‌లో యశ్వంత్ పేరుతో ఏకంగా రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు. ఇంటిపేరు ఒక్కటే కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా సాయిదీపక్‌ను నామినీగా చేర్చారు.

ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం

పథకం ప్రకారం ఈ నెల 14న మోతె పట్టినగర్ సమీపంలో యశ్వంత్‌తో కలిసి మద్యం తాగారు. యశ్వంత్ మత్తులోకి జారగానే అతడిపై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అది రోడ్డు ప్రమాదంగా కనిపించేలా రక్తపు మడుగులో ఉన్న అతడిని రోడ్డుపై పడేసి, పక్కనే స్కూటీని పడేశారు. ఏమీ తెలియనట్టుగా అక్కడే ఉండి, అటుగా వెళ్తున్న ప్రయాణికులతో కలిసి తామే బాధితుడిని ఆసుపత్రికి తరలించి నాటకమాడారు.

నిజం నిలకడ మీద తెలిసింది

బాధితుడి బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు నిందితుల ప్రవర్తనపై అనుమానం వచ్చింది. సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అసలు నిజం బయటపడింది. యశ్వంత్ ప్రమాదానికి గురికాలేదని, పథకం ప్రకారమే అతడిని చంపేందుకు ప్రయత్నించారని ఆధారాలతో సహా తేలింది. సారపాకలో తలదాచుకున్న సాయిదీపక్, భానుప్రకాష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, బీమా సొమ్ము కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

ప్రస్తుతం నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. ప్రాణ స్నేహితుడని నమ్మితే రూ. 2 కోట్ల కోసం ప్రాణాలు తీయాలనుకున్న ఈ ఉదంతం వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఉచితంగా ఏది వచ్చినా, అతిగా ఎవరు ప్రేమ చూపించినా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *