ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఊహించని గందరగోళం.. స్టార్టప్ ఫౌండర్ల వస్తువులు మాయం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదస్సుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చాటిచెప్పిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ తొలిరోజే అభాసుపాలైంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సోమవారం ప్రారంభమైన ఈ ఈవెంట్ నిర్వహణలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత గురించి చర్చించాల్సిన చోట కనీస సౌకర్యాలు లేకపోవడం, భద్రతా వైఫల్యాలు బయటపడటం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ.. కనెక్టివిటీ సమస్యలు
సదస్సును వీక్షించేందుకు సుమారు 70,000 మందికి పైగా సందర్శకులు తరలిరావడంతో భారత్ మండపం జనసందోహంగా మారింది. అయితే వచ్చిన వారికి సరైన దిశానిర్దేశం చేసే సిబ్బంది లేకపోవడంతో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. ఏఐ సమ్మిట్ అని పేరు పెట్టినా.. అక్కడ మొబైల్ డేటా కనెక్టివిటీ సమస్యలు తలెత్తడం సందర్శకులను విస్మయానికి గురిచేసింది. దీనికి తోడు పలుమార్లు సెక్యూరిటీ చెకింగ్‌ల పేరుతో గంటల తరబడి నిలబెట్టడంపై స్టార్టప్ ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
హై సెక్యూరిటీ జోన్‌లోనే దొంగతనాలు
ఈ సదస్సులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. భారీ భద్రత మధ్య నిర్వహించిన ఎగ్జిబిషన్ స్టాళ్లలో వస్తువులు మాయమవ్వడం. నియో శాపీన్ సీఈవో ధనంజయ్ యాదవ్ ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శన నిమిత్తం మధ్యాహ్నం 12 గంటలకే భద్రతా సిబ్బంది స్టాళ్లను ఖాళీ చేయించారని, వారిపై నమ్మకంతో సామాగ్రిని అక్కడే వదిలి వెళ్లామని ఆయన తెలిపారు. తీరా సాయంత్రం 6 గంటలకు వచ్చి చూసేసరికి విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని ఆయన ఫిర్యాదు చేశారు. భారీగా నిధులు వెచ్చించి స్టాళ్లను ఏర్పాటు చేసుకున్న స్టార్టప్ ఫౌండర్లకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
మంచినీళ్లు కూడా లేని దుస్థితి.. ఫౌండర్ల ఆగ్రహం
రెస్కిల్ ఫౌండర్ పునీత్ జైన్ వంటి పలువురు టెక్ నిపుణులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిర్వహణ లోపాలను ఎండగట్టారు. “ప్రతినిధులను, ఫౌండర్లను బయటే నిలబెట్టారు. తాగడానికి మంచినీరు కూడా లేదు. మీడియాలో అన్నీ గొప్పగా కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అంతా గందరగోళంగా ఉంది. భారత ఏఐ భవిష్యత్తు నిర్మాణం ఇలా ఉండకూడదు” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు
నిర్వహణలో జరిగిన పొరపాట్లపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. సందర్శకులకు ఎదురైన ఇబ్బందులకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తొలిరోజు అనూహ్యంగా రద్దీ పెరగడం వల్లే ఇలా జరిగిందని సమర్థించుకున్నారు. లోపాలను సరిదిద్దడానికి ప్రత్యేకంగా ఒక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేశామని, ఇకపై సదస్సు సజావుగా సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
భారతదేశాన్ని గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో.. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సుల నిర్వహణలో ఎదురైన వైఫల్యాలు దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.