65 ఏళ్ల నాటి కిడ్నాప్ మిస్టరీ వీడింది.. 80 ఏళ్ల వయసులో కన్నవారి చెంతకు చేరిన వృద్ధురాలు

65 ఏళ్ల నాటి కిడ్నాప్ మిస్టరీ వీడింది.. 80 ఏళ్ల వయసులో కన్నవారి చెంతకు చేరిన వృద్ధురాలు

యూపీలో అరుదైన మరియు భావోద్వేగభరితమైన ఘటన వెలుగుచూసింది. సుమారు ఆరున్నర దశాబ్దాల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ, ఎట్టకేలకు తన 80 ఏళ్ల వయసులో సొంత గూటికి చేరుకుంది. 1961 ప్రాంతంలో జరిగిన ఈ విస్మయకర సంఘటన వివరాల్లోకి వెళ్తే..

హర్దోయ్ ప్రాంతానికి చెందిన మిథానీ అనే 15 ఏళ్ల బాలిక తన తండ్రి, సోదరుడితో కలిసి నివసించేది. ఆ సమయంలో ఆమెకు వివాహం నిశ్చయమైంది, మరికొద్ది రోజుల్లో అత్తారింటికి వెళ్లాల్సి ఉంది. అయితే విధి మరోలా తలచింది. 1961-62 కాలంలో బల్దేవ్ అనే పేరుమోసిన గ్యాంగ్ స్టర్ ఆమె ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లో దోచుకోవడానికి ఏమీ దొరక్కపోవడంతో కోపంతో మిథానీని అపహరించుకుపోయాడు.

ఆ కిరాతకుడు ఆమెను విక్రయించేందుకు అలీగఢ్‌కు తీసుకురాగా, సోహన్‌లాల్ యాదవ్ అనే మల్లయోధుడు ఆమె పరిస్థితిని చూసి చలించిపోయాడు. ఆమెను రక్షించి, ఆపై పెళ్లి చేసుకున్నాడు. మిథానీకి పిల్లలు పుట్టి, వారు పెద్దవారైనా తన పుట్టింటిపై ఉన్న మమకారం చావలేదు. దశాబ్దాలు గడిచినా తన కుటుంబం కోసం ఆమె తపించేది.

చివరికి ఆమె చిన్న కుమార్తె తన తల్లి కోరికను తీర్చాలని నిర్ణయించుకుంది. పాత జ్ఞాపకాల ఆధారంగా ఎంతో కష్టపడి హర్దోయ్‌లోని వారి పాత అడ్రస్‌ను సంపాదించింది. 65 ఏళ్ల తర్వాత తన వాళ్లను కలుసుకున్న మిథానీ కళ్లలో ఆనందబాష్పాలు చిందాయి. ఈ అద్భుతమైన పునఃకలయిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *