బరేలీలో పుట్టినరోజు వేడుకల్లో ఘోరం ముస్లిం స్నేహితులతో కలిసి వెళ్లిన హిందూ విద్యార్థినిపై దాడి

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఒక నర్సింగ్ విద్యార్థిని పుట్టినరోజు వేడుకలు హింసాత్మకంగా మారాయి. కేఫ్ లో ముస్లిం స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా, ‘లవ్ జిహాద్’ అంటూ ఒక గుంపు దాడికి పాల్పడింది. తన స్నేహితులపై భౌతిక దాడి చేయడమే కాకుండా, తన ఫోన్ లాక్కుని అసభ్యంగా ప్రవర్తించారని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. కేఫ్ నిర్వాహకుడు శైలేంద్ర వర్మ మాట్లాడుతూ, దాడి చేసిన వారు షాపులోని వస్తువులను ధ్వంసం చేసి సుమారు 50 వేల రూపాయల నష్టం కలిగించారని తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో ఎటువంటి లవ్ జిహాద్ కోణం లేదని స్పష్టం చేశారు. కేఫ్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గొడవ మరియు ఆస్తి నష్టం కింద కేసులు బుక్ చేశారు. వారంతా తన క్లాస్‌మేట్స్ అని, తానే ఆహ్వానించానని చెప్పిన విద్యార్థిని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.