బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక జ్వాలలు షరీఫ్ హాదీ మృతితో అదుపుతప్పిన ఆందోళనకారులు

ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణవార్తతో బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. నిన్న రాత్రి ఆందోళనకారులు ఢాకాలోని ధన్మండి 32 వద్ద ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసానికి నిప్పు పెట్టడమే కాకుండా, రాజ్‌షాహిలోని అవామీ లీగ్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వార్తాపత్రిక కార్యాలయాలు, సాంస్కృతిక సంస్థ ‘ఛాయానట్’ మరియు చిట్టగాంగ్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్ నివాసంపై కూడా దాడులు జరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాలు నిరసనకారుల గుప్పిట్లోకి వెళ్లాయి.
పరిస్థితిని అదుపు చేయడంలో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని బీఎన్‌పీ సహా పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. గత డిసెంబర్ 12న కాల్పుల్లో గాయపడి సింగపూర్‌లో చికిత్స పొందుతూ హాదీ మరణించడంతో ఈ హింస మొదలైంది. ప్రస్తుతం రోడ్లన్నీ దిగ్బంధించబడ్డాయి మరియు ఆందోళనకారులు పెద్ద ఎత్తున షాబాగ్ వైపు తరలివస్తున్నారు. భద్రతా దళాలు ఎక్కడా కనిపించకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.