చిట్టగాంగ్‌లో భారత రాయబారి నివాసంపై దాడి ఘటనలో 12 మంది అరెస్ట్

చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషనర్ రాజీవ్ రంజన్ నివాసంపై శుక్రవారం తెల్లవారుజామున ఆందోళనకారులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో హైకమిషనర్ తన నివాసంలోనే ఉన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ మరియు సౌండ్ గ్రెనేడ్లను ప్రయోగించాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ హసిబ్ అజీజ్ ఘటనా స్థలాన్ని సందర్శించి భారత రాయబారితో మాట్లాడారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో దౌత్యవేత్తల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు మైమెన్‌సింగ్‌లో మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో దిపుచంద్ర దాస్ అనే కార్మికుడిని తోటి ఉద్యోగులు కొట్టి చంపారు. ఫ్యాక్టరీ లోపలే అతడిని హత్య చేసి ఆపై మృతదేహాన్ని రోడ్డు పక్కన తగలబెట్టారు. ఆగస్టులో ప్రభుత్వం మారినప్పటి నుండి మైనారిటీలపై దాడులు పెరుగుతుండటంతో అక్కడి హిందువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వరుసగా జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనలు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి.