ఎంపీకి ఎంపీ పోటీ, పార్లమెంట్ కారిడార్లలో బీజేపీ అంతర్గత యుద్ధం!

జూలై 21 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈసారి ఒక ప్రత్యేకమైన ఎన్నికకు సాక్ష్యంగా నిలవనున్నాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా గవర్నింగ్ కౌన్సిల్ కార్యదర్శి (అడ్మినిస్ట్రేషన్) పదవికి అధికార బీజేపీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, మాజీ కేంద్ర మంత్రి సంజీవ్ బాల్యన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత 25 సంవత్సరాలుగా ఈ పదవిలో ఉన్న రూడీకి, ఈసారి సొంత పార్టీకి చెందిన బాల్యన్ నుండి గట్టి పోటీ ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సహా సుమారు 1200 మంది పార్లమెంట్ సభ్యులు ఈ కీలక ఎన్నికలో ఓటు వేయనున్నారు.
సాధారణంగా క్లబ్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతుండగా, బాల్యన్ పోటీలోకి రావడం ఈ ఎన్నికను ఆసక్తికరంగా మార్చింది. రూడీ, బాల్యన్లకు మద్దతు విషయంలో బీజేపీలోనూ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, బాల్యన్ ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు, ఇది ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ పదవికి ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది.