ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠంపై హైకోర్టు కీలక తీర్పు.. ఆ కౌన్సిలర్ కిడ్నాప్ డ్రామాలో షాకింగ్ ట్విస్ట్!

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ హైడ్రామాపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక ఈ విషయంలో ఎన్నికల సంఘం, కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
కిడ్నాప్ కాలేదు.. బంధించారు! కౌన్సిలర్ సంచలన వాంగ్మూలం
ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా పోలీసులు ఆయన్ను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యాదగిరి ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
బీఆర్ఎస్ నేతలు తనను బలవంతంగా చీరాలలోని ఒక రిసార్ట్లో బంధించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు తనను హైదరాబాద్ అంతా తిప్పి, సుమారు 12 గంటల తర్వాత చీరాలకు తీసుకెళ్లారని ఆయన కోర్టుకు వివరించారు. ఈ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్న న్యాయస్థానం, తదుపరి చర్యలపై దృష్టి సారించింది. స్టే ఎత్తివేతతో ఇప్పుడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.