ఏఐ సమ్మిట్‌లో ఊహించని షాక్.. స్టార్టప్ సీఈఓ ల్యాప్‌టాప్ మాయం

ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా ప్రారంభమైన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో అనూహ్య ఘటనలు వెలుగుచూశాయి. సాంకేతిక హబ్‌గా పేరుగాంచిన ఈ వేదికపై అస్తవ్యస్త నిర్వహణ, భద్రతా వైఫల్యాలు సందర్శకులను, పారిశ్రామికవేత్తలను విస్మయానికి గురిచేస్తున్నాయి.
డిజిటల్ ఇండియా సదస్సులో యూపీఐ కష్టాలు
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వెల్లువెత్తుతున్న తరుణంలో, సాక్షాత్తూ ఏఐ సమ్మిట్‌లోని ఫుడ్ కౌంటర్ల వద్ద యూపీఐ (UPI) సేవలు నిలిచిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్ సిగ్నల్స్ బలహీనంగా ఉండటం, క్యూఆర్ కోడ్‌లు పనిచేయకపోవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. “యూపీఐ పనిచేయనప్పుడు ఇది డిజిటల్ ఇండియా ఈవెంట్ ఎలా అవుతుంది?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులను నిలదీస్తున్నారు.
స్టార్టప్ వ్యవస్థాపకుడికి చేదు అనుభవం
ఈ సదస్సులో అత్యంత విచారకరమైన ఘటన నియోసేపియన్ (NeoSapien) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ధనంజయ్ యాదవ్‌కు ఎదురైంది. తన స్టార్టప్ రూపొందించిన ‘వేరబుల్ స్మార్ట్ ఏఐ’ పరికరాన్ని ప్రదర్శించేందుకు ఆయన ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఆయనను అక్కడి నుంచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
భద్రతా సిబ్బంది హామీ మేరకు తన ల్యాప్‌టాప్‌లు, విలువైన ప్రోటోటైప్ పరికరాలను స్టాల్‌లోనే వదిలి వెళ్లిన ధనంజయ్.. తిరిగి వచ్చి చూసేసరికి అవి మాయమయ్యాయి. తన కలల ప్రాజెక్టు కోసం భారీగా ఖర్చు చేసి, ఎంతో శ్రమించిన ఆయనకు ఈ ఘటన కోలుకోలేని దెబ్బ తీసింది. దేశ రాజధానిలో పటిష్ట భద్రత మధ్య జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ సమ్మిట్‌లో 600కు పైగా స్టార్టప్‌లు, 13 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నప్పటికీ, కనీస వైఫై సదుపాయం లేకపోవడం మరియు భద్రతా లోపాలు భారత సాంకేతిక రంగ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.