జైలులోనే ఇమ్రాన్ ఖాన్ హత్యకు భారీ కుట్ర? ఆర్మీ చీఫ్ మరియు పీసీబీ ఛైర్మన్‌పై సోదరీమణుల సంచలన ఆరోపణలు

జైలులోనే ఇమ్రాన్ ఖాన్ హత్యకు భారీ కుట్ర? ఆర్మీ చీఫ్ మరియు పీసీబీ ఛైర్మన్‌పై సోదరీమణుల సంచలన ఆరోపణలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలులోనే అంతమొందించేందుకు తెరవెనుక భయంకరమైన స్కెచ్ పడిందా? అవుననే అంటున్నారు ఆయన సోదరీమణులు అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరియు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కలిసి ఇమ్రాన్‌ను చంపేందుకు కుట్ర పన్నారని వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.

ప్రాణాపాయంలో ఇమ్రాన్ ఖాన్

ఇటీవల జైలులో ఇమ్రాన్‌ను కలిసిన సమయంలో ఆయన స్వయంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని వెల్లడించినట్లు సోదరీమణులు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. “వీరు నన్ను చంపేస్తారు.. నన్ను అంతమొందించేందుకు పక్కా ప్లాన్ వేశారు” అని ఇమ్రాన్ తనతో అన్నట్లు ఉజ్మా ఖాన్ పేర్కొన్నారు. తమకు కూడా ప్రాణహాని ఉందని, మొహ్సిన్ నఖ్వీ తమను నేరుగా బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు.

కంటిచూపు కోల్పోతున్న దిగ్గజ క్రికెటర్

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత ఆందోళనకరంగా ఉంది. జైలులో సరైన వైద్యం అందకపోవడంతో ఆయన కుడి కంటి చూపు దాదాపు 85 శాతం తగ్గిపోయిందని, కేవలం 15 శాతం చూపు మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత వైద్యులతో పరీక్షలు చేయించుకుంటామన్నా ప్రభుత్వం మొండిగా తిరస్కరిస్తోందని అలీమా ఖాన్ మండిపడ్డారు.

హెచ్చరించిన కుటుంబ సభ్యులు

“వారికి రక్తం రుచి మరిగింది. ఇమ్రాన్ ఖాన్‌కు గానీ, మా కుటుంబానికి గానీ ఏమైనా జరిగితే.. వారి భవిష్యత్తు తరాలను కూడా మేము వదిలిపెట్టం” అంటూ అలీమా ఖాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మరోవైపు టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సైతం ఇమ్రాన్ పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఒక ప్రపంచ స్థాయి క్రికెటర్, మాజీ దేశాధినేత జైలు గదుల్లో ప్రాణాల కోసం పోరాడుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *