సామాన్యులకు విమాన యోగం కొత్త ఏడాదిలో సేవలందించనున్న శంఖ్ ఎయిర్‌లైన్స్

వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ‘శంఖ్ ఎయిర్‌లైన్స్’ తన విమాన సర్వీసులను ప్రారంభించనుంది. మూడు ఎయిర్‌బస్ విమానాలతో మొదలయ్యే ఈ సంస్థ, ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో లక్నో నుండి ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు సర్వీసులు నడపనున్నట్లు సంస్థ చైర్మన్ శ్రవణ్ కుమార్ విశ్వకర్మ వెల్లడించారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించి, 2028-29 నాటికి అంతర్జాతీయ విమానాలను కూడా నడపాలనేది వారి ప్రణాళిక.
ఒకప్పుడు ఆటో నడిపి నేడు ఎయిర్‌లైన్ అధినేతగా ఎదిగిన విశ్వకర్మ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. విమాన ప్రయాణం విలాసం కాదు, అది ఒక సామాన్య రవాణా సాధనం అని ఆయన పేర్కొన్నారు. పండుగ సమయాల్లో టికెట్ ధరలు పెంచబోమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సొంత నిధులతో నడుస్తున్న ఈ సంస్థ, విమానయాన రంగంలో పోటీని పెంచుతూ సామాన్యులకు మేలు చేకూర్చనుంది.