సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్ వార్నింగ్

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీలత మరియు అసభ్యకరమైన కంటెంట్‌ను నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కంపెనీలను హెచ్చరించింది. ముఖ్యంగా చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టవిరుద్ధమైన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐటీ చట్టం సెక్షన్ 79 మరియు ఐటీ నిబంధనలు 2021 ప్రకారం, తమ ప్లాట్‌ఫారమ్‌లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం సంస్థల బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొంది.
ఎవరైనా తన నగ్నత్వం లేదా అసభ్యకర వీడియోల గురించి ఫిర్యాదు చేస్తే, ఆ కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఈ నిబంధనలను పాటించకపోతే, సోషల్ మీడియా సంస్థలు తమకున్న చట్టపరమైన రక్షణను కోల్పోతాయని మరియు తీవ్రమైన న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వినియోగదారుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.