ఆకాశం నుండి నిప్పులు కురిపిస్తూ 120 కిమీ దూరంలోని శత్రువులని హతమార్చే సరికొత్త పినాకా రాకెట్

భారత రక్షణ రంగం మరో మైలురాయిని అధిగమిస్తూ డిఆర్డిఓ (DRDO) స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాకా రాకెట్ వ్యవస్థ సరికొత్త వెర్షన్ ఎల్ఆర్జిఆర్-120 (LRGR-120)ని విజయవంతంగా పరీక్షించింది. ఈ మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ కేవలం 44 సెకన్లలో 12 రాకెట్లను ప్రయోగించగలదు. గంటకు 5,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రాకెట్లు, జిపిఎస్ మరియు నావిగేషన్ సాయంతో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల బంకర్లను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి. కార్గిల్ యుద్ధంలో తన సత్తా చాటిన పినాకా, ఇప్పుడు మునుపటి కంటే రెట్టింపు శక్తితో సిద్ధమైంది.
రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పినాకా ఎంకే-3ని సైన్యంలో చేర్చుకోవడానికి అనుమతినిచ్చింది. దీని మొదటి వెర్షన్ పరిధి 60 కిమీ మాత్రమే ఉండగా, ఇప్పుడు అది 120 కిమీలకు పెరిగింది. శివుని విల్లు పేరు మీదుగా పిలువబడే ఈ వ్యవస్థ, శత్రువుల ట్యాంకులను మరియు మందుపాతరలను పేల్చివేయడంలో ఆరితేరింది. అర్మేనియా వంటి దేశాలు ఇప్పటికే ఈ శక్తివంతమైన ఆయుధాన్ని భారత్ నుండి కొనుగోలు చేశాయి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఈ దేశీ రాకెట్ వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో భారత రక్షణ సామర్థ్యాన్ని చాటిచెబుతోంది.