జమ్మూ కాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ మరియు ఎంపీ రుహుల్లా గృహ నిర్బంధం విద్యార్థుల పోరాటంతో ఉద్రిక్తత

జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ సహా పలువురు నేతలను అధికారులు గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్‌లోని గుప్కార్ రోడ్డులో శాంతియుత నిరసన చేపట్టకుండా నిరోధించేందుకు పోలీసులు వారి నివాసాల వద్ద భారీగా మోహరించారు. విద్యార్థుల గొంతు నొక్కడానికే ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా, ఏడాది దాటినా కమిటీ నివేదికను బయటపెట్టకపోవడంపై నేతలు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించే ఉద్దేశ్యం లేదని, అందుకే తమను నిర్బంధించారని వహీద్ పారా ఆరోపించారు. ప్రస్తుత కోటా విధానం యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని, నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.