సింధు జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత చంద్రభాగ నదిపై కొత్త ప్రాజెక్టుకు భారత్ పచ్చజెండా

పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చంద్రభాగ నదిపై 260 మెగావాట్ల ‘దుల్హస్తీ స్టేజ్-2’ జలవిద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. సుమారు 3,277 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ 19న జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది. 2007 నుండి నడుస్తున్న 390 మెగావాట్ల స్టేజ్-1 ప్రాజెక్టుకు ఇది కొనసాగింపుగా ఉండనుంది.
1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం చంద్రభాగ నీటిపై పాకిస్థాన్‌కు వాటా ఉన్నప్పటికీ ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య భారత్ ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. సుమారు 60 హెక్టార్ల భూమిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల పాకిస్థాన్‌కు వెళ్లే నీటి ప్రవాహం భారత్ నియంత్రణలోకి వస్తుంది. దీనివల్ల పొరుగు దేశంలో కరువు లేదా ఆకస్మిక వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ను నీటి సరఫరా విషయంలో దెబ్బకొట్టేందుకు భారత్ సిద్ధం చేసిన ఈ వ్యూహం ఆ దేశానికి గొడ్డలిపెట్టుగా మారనుంది.