18 రోజుల జైలు జీవితం తర్వాత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించారనే ఆరోపణలతో 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. జైలు వెలుపల మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత మరియు ఇతర పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
జైలు నాకు శిక్షణ కేంద్రం లాంటిది
విడుదల అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నాపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. నా ఇంటిపై దాడులు చేసి, కుటుంబ సభ్యులను బెదిరించినా నేను భయపడను. ఐ డోంట్ కేర్! రాజమండ్రి జైలు నాకు పట్టుదలను పెంచే శిక్షణ కేంద్రం లాంటిది” అని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ వెంటే నా పోరాటం
చంద్రబాబు, లోకేష్ కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని, కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి, బాధితుడైన తనను 18 రోజులు జైల్లో పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. తన చివరి శ్వాస వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని, ప్రభుత్వ వైఫల్యాలపై తన పోరాటం కొనసాగుతుందని అంబటి స్పష్టం చేశారు.