హైదరాబాద్ టు విజయవాడ కేవలం 2.5 గంటలే.. త్వరలో అద్దంలాంటి రోడ్లు

హైదరాబాద్ టు విజయవాడ కేవలం 2.5 గంటలే.. త్వరలో అద్దంలాంటి రోడ్లు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు నెట్‌వర్క్ రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘2047 రైజింగ్ తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అద్దం లాంటి రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బుధవారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ 2026-27 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక ప్రకటనలు చేశారు.

హైదరాబాద్ – విజయవాడ 8 వరుసల రహదారి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ (NH 65) రహదారి విస్తరణపై మంత్రి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ రహదారిని 8 వరుసలుగా విస్తరించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చని మంత్రి వెల్లడించారు. దీనిపై త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పనుల వేగవంతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

గేమ్ చేంజర్ ప్రాజెక్టులపై నజర్

రాష్ట్ర అభివృద్ధిలో రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వంటి ప్రాజెక్టులు గేమ్ చేంజర్‌గా మారబోతున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ‘హ్యామ్’ (HAM) విధానంలో నిర్మించబోయే రోడ్లతో రాష్ట్రవ్యాప్త కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పారదర్శకతకు పెద్దపీట

బడ్జెట్ అంచనాలు స్పష్టమైన ప్రణాళికతో ఉండాలని, నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *