కేంద్రం పెత్తనంపై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు.. రాజ్యాంగ సవరణే మార్గమంటూ అసెంబ్లీలో డిమాండ్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రాల హక్కులు, నిధుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ భారత రాజ్యాంగాన్ని సవరించాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ నివేదికలోని మొదటి భాగాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా స్టాలిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం గుప్పిట్లో అధికారాలు.. రాష్ట్రాల పరిస్థితి ఏంటి?
భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన దేశానికి సమాఖ్య వ్యవస్థే పునాది అని, కానీ కేంద్రం అన్ని అధికారాలను తన గుప్పిట్లోనే ఉంచుకుంటోందని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రాలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ప్రతి చిన్న విషయానికి, చివరకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల కోసం కూడా కేంద్రంతో పోరాడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అడుక్కునే స్థితిలో మేము లేము
“ఒక రాష్ట్రంగా మా ప్రజల కలలను నెరవేర్చేందుకు మాకు పూర్తి అధికారాలు లేవు. విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో మేము ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ, నిధుల కోసం ప్రతిసారి కేంద్రం ముందు చేయి చాచాల్సి వస్తోంది. ఇంకా ఎన్ని రోజులు వారు ఇస్తే తీసుకోవాలనే స్థితిలో మనం ఉండాలి? మేము తలవంచి అడుక్కునే వ్యక్తులం కాదు.. మాకు రాష్ట్ర స్వయంప్రతిపత్తి కావాలి” అని స్టాలిన్ ఘాటుగా స్పందించారు.
రాజ్యాంగ పునర్నిర్మాణం అవసరం
రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించేలా, సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసేలా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో సుపరిపాలన అందాలంటే కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, అందుకోసం రాజ్యాంగబద్ధమైన నిర్మాణాత్మక మార్పులు తప్పనిసరని స్టాలిన్ పేర్కొన్నారు.