శిక్షా కాలం ముగిసినా పాక్ జైళ్లలోనే 167 మంది భారతీయులు వెంటనే విడుదల చేయాలని భారత్ గట్టి హెచ్చరిక

పాకిస్థాన్ జైళ్లలో శిక్షా కాలం పూర్తయినప్పటికీ ఇంకా మగ్గుతున్న 167 మంది భారతీయ పౌరులను వెంటనే విడుదల చేయాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. మానవీయ కోణంలో మరియు ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శిక్షా కాలం ముగిసిన వారిని తక్షణమే స్వదేశానికి పంపాలని న్యూఢిల్లీ ఇస్లామాబాద్‌కు స్పష్టం చేసింది. వీరిలో పొరపాటున సరిహద్దు దాటిన మత్స్యకారులు మరియు సామాన్య పౌరులు అధిక సంఖ్యలో ఉన్నారు.
ప్రస్తుతం పాక్ జైళ్లలో 58 మంది భారతీయ పౌరులు మరియు 199 మంది మత్స్యకారులు బందీలుగా ఉండగా వారిలో 167 మంది శిక్ష ఇప్పటికే ముగిసింది. అడ్మినిస్ట్రేటివ్ జాప్యం కారణంగా వారు ఇంకా విడుదల కాలేదు. భారత ప్రభుత్వం వీరి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ మిగిలిన 35 మంది భారతీయులకు కాన్సులర్ సహాయం అందించేందుకు అనుమతించాలని కోరింది తద్వారా వారి గుర్తింపును ధృవీకరించి స్వదేశానికి రప్పించే ప్రక్రియ వేగవంతం అవుతుంది.