యూట్యూబ్ యూజర్లకు షాక్.. ఒక్కసారిగా నిలిచిపోయిన సేవలు

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అమెరికా నుంచి భారత్ వరకు లక్షలాది మంది యూజర్లు ఈ సాంకేతిక సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యాప్‌ను ఓపెన్ చేయగానే ‘Something Went Wrong’ అనే మెసేజ్ కనిపిస్తుండటంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం.. ఒక్క అమెరికాలోనే సుమారు 3.5 లక్షల మందికి పైగా ఫిర్యాదులు చేశారు. భారత్‌లో కూడా తెల్లవారుజామున 6 గంటల సమయం నుండి ఈ అంతరాయం ఏర్పడింది. కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ మీట్ వంటి ఇతర సేవలపై కూడా ఈ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ప్లేలిస్ట్‌లు లోడ్ కాకపోవడం, కేవలం సైడ్‌బార్ మాత్రమే కనిపించడం వంటి సమస్యలతో యూజర్లు సతమతమవుతున్నారు.
ఈ భారీ గ్లోబల్ అవుటేజ్‌పై మాతృ సంస్థ ఆల్ఫాబెట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాంకేతిక లోపానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సమస్యను అధిగమించేందుకు యాప్‌ను అప్‌డేట్ చేయడం లేదా బ్రౌజర్ కాష్ క్లియర్ చేయడం వంటివి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.