ఏడేళ్ల చిన్నారిపై ఘాతుకం.. డ్రమ్ములో మృతదేహం.. ఏపీ సర్కార్‌పై వైఎస్ జగన్ నిప్పులు

మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరవైందని, కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
సిగ్గుచేటు కాదా చంద్రబాబు గారూ?
నీరుగట్టువారిపల్లిలో బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించలేదని జగన్ మండిపడ్డారు. “చిన్నారిని కాపాడలేకపోవడం మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?” అని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, ప్రశ్నించిన వారిపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.
వరుస ఘటనలు.. బెంబేలెత్తుతున్న మహిళలు
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని జగన్ పేర్కొన్నారు.
- కొత్త ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై అత్యాచారం.
- కంబాల దిన్నెలో మూడేళ్ల చిన్నారి హత్య.
- వడమాలపేటలో మూడున్నరేళ్ల బాలికపై ఘాతుకం.ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని, కేవలం ఎల్లో మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఈ అనర్థాలు
రాష్ట్రంలో హోంమంత్రికి బాధ్యత లేదని, ముఖ్యమంత్రి కుమారుడు అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్లే నేరగాళ్లకు భయం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. తక్షణమే చంద్రబాబు మేల్కొని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడాలని, మహిళలకు భరోసా కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు.