బందరు ‘తాజ్ మహల్’ కథ: మీట తిప్పితే పైకి వచ్చే ప్రేయసి శవపేటిక.. ఈ విదేశీ జంట ప్రేమ విస్మయం!

మచిలీపట్నం నడిబొడ్డున 200 ఏళ్ల నాటి ఒక అపురూప ప్రేమకావ్యం శిథిలావస్థలో ఉన్న చర్చి గోడల మధ్య దాగి ఉంది. షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కడితే, ఇక్కడ ఒక బ్రిటిష్ మేజర్ జనరల్ తన ప్రేయసి కోసం ఒక చర్చిని, అందులో వినూత్నమైన సమాధిని నిర్మించారు.
గ్రేట్ స్కాండల్ ఆఫ్ మసులీపటం
ఈ కథానాయకుడు జాన్ పాటర్, నాయిక అరబెల్లా రాబిన్సన్. 18వ శతాబ్దపు చివరలో మచిలీపట్నం కోటలో చిగురించిన వీరి ప్రేమకు కులమతాలు, హోదాలు అడ్డువచ్చాయి. అప్పట్లో పెళ్లి కాకుండానే వారు కలిసి జీవించడం ఒక పెద్ద సంచలనంగా మారింది. అందుకే దీనిని ‘గ్రేట్ స్కాండల్ ఆఫ్ మసులీపటం’ అని పిలిచేవారు.
మరణం తర్వాత కూడా వీడని బంధం
మలేరియాతో అరబెల్లా 40 ఏళ్లకే కన్నుమూసింది. ఆమెను ఖననం చేసేందుకు స్థానిక చర్చిలు నిరాకరించడంతో, జాన్ పాటర్ సొంతంగా 6.5 ఎకరాల స్థలాన్ని కొని సెయింట్ మేరీస్ చర్చిని నిర్మించాడు. ఆమెను ఈజిప్టు మమ్మీల తరహాలో సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచి గాజు పెట్టెలో ఉంచారు.
వింతైన లాకింగ్ వ్యవస్థ
ఈ సమాధికి ఒక ప్రత్యేకత ఉంది. సమాధి పక్కన ఉన్న గోడలోని ఒక మీట (స్పిండిల్) తిప్పితే, భూమిలో ఉన్న గాజు శవపేటిక పైకి వచ్చేది. జాన్ పాటర్ తనకు బాధ కలిగినప్పుడల్లా ఆ మీట తిప్పి, ప్రేయసి మృతదేహం ముందు కూర్చుని తన మనసులోని మాటలు చెప్పుకునేవాడని చరిత్ర చెబుతోంది.
శాశ్వతంగా మూసివేత
ఒకసారి చర్చి పనులు చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక కార్మికుడు ఆ మీట తిప్పగా, ఒక్కసారిగా శవపేటిక బయటకు రావడంతో భయంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన తర్వాత అప్పటి కలెక్టర్ ఆదేశాలతో ఆ సమాధిని పాలరాతితో శాశ్వతంగా మూసివేశారు. నేటికీ ఆ చర్చిలో అరబెల్లా సమాధి ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది.