పోలీసులపై పగతో 15 ఏళ్లుగా కేవలం వారి ఇళ్లలోనే దొంగతనాలు చేస్తున్న సీరియల్ చోర్ అరెస్ట్
February 13, 2026

మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్‌కు చెందిన దీపేష్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా కేవలం పోలీసుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో పోలీసులు తనను కొట్టినందుకు పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వింత నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఖాండ్వా పోలీస్ లైన్స్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల ఇళ్లలో జరిగిన చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, సిసిటివి ఫుటేజ్ ఆధారంగా అతడిని ఎట్టకేలకు పట్టుకున్నారు.
చిరు వ్యాపారి వేషంలో పోలీస్ క్వార్టర్ల వద్ద తిరుగుతూ రెక్కీ నిర్వహించే దీపేష్, సమయం చూసి చోరీలకు పాల్పడేవాడు. అరెస్ట్ చేసే క్రమంలో భవనం పైనుంచి దూకి గాయపడిన ఇతడిని కోర్టు రిమాండ్‌కు తరలించింది. నిందితుడి నుంచి నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, రాష్ట్రవ్యాప్తంగా అతను చేసిన వరుస దొంగతనాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.