ఎంపీల పెన్షన్లు కట్.. శ్రీలంక సంచలన నిర్ణయం.. నెక్స్ట్ టార్గెట్ ఇండియానేనా?

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక ఒక చారిత్రాత్మక నిర్ణయంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దేశంలోని ఎంపీలకు అందుతున్న పెన్షన్ ప్రయోజనాలను రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం కీలక బిల్లును ఆమోదించింది. ఫిబ్రవరి 18న జరిగిన పార్లమెంట్ సమావేశంలో 225 మంది సభ్యులకు గాను 154 మంది ఈ బిల్లుకు మద్దతు తెలపడంతో ఇది తక్షణమే అమలులోకి వచ్చింది. కేవలం ఐదేళ్లు పదవిలో ఉంటే చాలు జీవితాంతం పెన్షన్ పొందే రాజకీయ ‘విశేషాధికారానికి’ దీనితో తెరపడింది.
ప్రజా పోరాటమే ఆయుధంగా.. 2022లో శ్రీలంకను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం తర్వాత అధికారంలోకి వచ్చిన అనుర కుమార దిస్సనాయకే ప్రభుత్వం, ఎన్నికల హామీ మేరకు ఈ చర్యలు చేపట్టింది. కేవలం పెన్షన్లే కాకుండా, మాజీ అధ్యక్షులకు ఇచ్చే బంగ్లాలు, లగ్జరీ కార్లు, భారీ భద్రతను కూడా ఇప్పటికే తొలగించారు. “సామాన్యులు ఆకలితో అలమటిస్తుంటే, ప్రజాప్రతినిధులు మాత్రం ప్రత్యేక సౌకర్యాలు అనుభవించడం నైతికంగా సరికాదు” అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
భారత్ లో పరిస్థితి ఏంటి? శ్రీలంక నిర్ణయంతో ఇప్పుడు అందరి దృష్టి భారత్, పాకిస్తాన్ వైపు మళ్లింది. మన దేశంలో ఒక మాజీ ఎంపీకి నెలకు కనీసం రూ. 31,000 పెన్షన్ లభిస్తోంది. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉంటే ప్రతి ఏడాదికి అదనంగా రూ. 2,500 కలుస్తుంది. ఇదిలా ఉంటే, దేశంలోని వృద్ధులు, వితంతువులకు అందుతున్న సామాజిక పింఛన్లు నెలకు కేవలం రూ. 300 నుంచి రూ. 500 మధ్యే ఉండటం గమనార్హం. ఈ భారీ వ్యత్యాసంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోనూ అదే తీరు.. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌లో ఎంపీల జీతాలను రూ. 5.19 లక్షలకు పెంచాలనే ప్రతిపాదనలు రావడం విమర్శలకు దారితీస్తోంది. బంగ్లాదేశ్‌లో కూడా ఎంపీలకు జీతం తక్కువగా ఉన్నప్పటికీ, పన్ను మినహాయింపులు, ఉచిత గృహవసతి వంటి రూపంలో భారీ ప్రయోజనాలు అందుతున్నాయి.
విమర్శలు ఉన్నప్పటికీ.. అయితే, పెన్షన్లు రద్దు చేస్తే సమర్థులైన వ్యక్తులు రాజకీయాల్లోకి రారని, ఆర్థిక భద్రత లేకపోతే అవినీతి పెరుగుతుందని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, న్యాయశాఖ మంత్రి హర్షన నానాయక్కర మాత్రం “ఓటర్లు ఎంపీలకు పెన్షన్లు ఇవ్వాలని కోరుకోవడం లేదు” అని తేల్చి చెప్పారు. శ్రీలంక బాటలో భారత్ కూడా పయనిస్తుందా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.