ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ అనైతికం సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ వాడకాన్ని సుప్రీంకోర్టు అనైతికంగా ప్రకటించింది. తగిన శాస్త్రీయ ఆధారం లేని ఈ పద్ధతిని రోగులకు అందించడం వైద్య నిర్లక్ష్యం కిందకే వస్తుందని జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం పేర్కొంది. ఈ థెరపీని కేవలం పర్యవేక్షణలో ఉండే క్లినికల్ ట్రయల్స్‌కు మాత్రమే అనుమతించాలని, సాధారణ వైద్య ప్రక్రియగా దీనిని కొనసాగించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ మరియు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌తో చర్చించి ఈ విషయంలో పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ చికిత్స పొందుతున్న రోగులను నాలుగు వారాల్లోగా పరిశోధనా సంస్థలకు తరలించాలని సూచించింది. చికిత్స గురించి పూర్తి సమాచారం లేకుండా రోగుల నుండి తీసుకునే సమ్మతి చెల్లుబాటు కాదని, ఇది వైద్య నైతికతను ఉల్లంఘించడమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.