ముంబై వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఇకపై నగరాల్లో పరిశ్రమలకు ఉండవు

తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త విప్లవాత్మక ప్రణాళికను ప్రకటించారు. ముంబైలో జరిగిన ‘క్లైమేట్ వీక్’ సదస్సులో పాల్గొన్న ఆయన, రాబోయే ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల నుంచి పరిశ్రమలను పూర్తిగా తరలిస్తామని స్పష్టం చేశారు. నగరాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వీటిని హైదరాబాద్ శివార్లకు లేదా గ్రామీణ ప్రాంతాలకు మళ్లించనున్నట్లు తెలిపారు.
వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా అడుగులు
2030 నాటికి తెలంగాణను ఒక లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం CURE, PURE, RARE అనే మూడు ప్రత్యేక వ్యూహాలను అమలు చేయబోతున్నట్లు వివరించారు.
- CURE: ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తారు.
- PURE: ORR మరియు రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ఉన్న ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తారు.
పర్యావరణ హితమే పరమావధి
రాష్ట్రంలో ప్రస్తుతం 25 శాతం గ్రీన్ ఎనర్జీ వినియోగం జరుగుతోందని, 2034 నాటికి విద్యుత్ డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుకుంటుందని ముఖ్యమంత్రి అంచనా వేశారు. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై (EV) పన్నులను పూర్తిగా రద్దు చేసినట్లు గుర్తుచేశారు. దీనివల్ల రాష్ట్రంలో ఈవీల వాడకం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
రవాణా వ్యవస్థలో భారీ మార్పులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న మరికొన్ని కీలక చర్యలను సీఎం వివరించారు.
- దాదాపు 2 లక్షల ఆటోలను పర్యావరణ హితంగా మారుస్తున్నారు.
- ఆర్టీసీలో కొత్తగా 3,500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
- హైదరాబాద్ మెట్రో రైలును మరో 200 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు.
నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించి, గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధిని పెంచడం ద్వారా సమతుల్య వృద్ధిని సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.