రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు వచ్చేది అప్పుడే!

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) పథకంలో భాగంగా 22వ విడత నగదును విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి చివరి వారంలో రైతుల ఖాతాల్లో రూ.2,000 జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత రికార్డులను పరిశీలిస్తే.. 19వ విడత ఫిబ్రవరి 24న, 16వ విడత ఫిబ్రవరి 28న, 13వ విడత ఫిబ్రవరి 27న విడుదలయ్యాయి. అదే ఒరవడిలో ఈసారి కూడా ఫిబ్రవరి నెలాఖరులోపు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది.
అయితే ఈ నగదు పొందాలంటే రైతులు ఖచ్చితంగా e-KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే ఆ రైతులకు డబ్బులు అందవని అధికారులు స్పష్టం చేశారు. లబ్ధిదారులు వెంటనే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ‘Beneficiary List’ ద్వారా తమ పేరును సరిచూసుకోవచ్చు. అలాగే ‘Know Your Status’ ఆప్షన్ ఉపయోగించి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు.