ఏయూలో మరోసారి రణరంగం.. విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ
February 18, 2026

విశాఖపట్నం ప్రతినిధి: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీ సమస్యల పరిష్కారంలో వైస్ ఛాన్సలర్ విఫలమయ్యారంటూ ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, అది కాస్తా పరస్పర దాడులకు దారితీసే పరిస్థితి కనిపించింది.
పోటాపోటీ నినాదాలతో క్యాంపస్ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వర్సిటీలోని సెనెట్ హాల్‌లో పోలీసుల సమక్షంలో అధికారులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. క్యాంపస్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.