హిందూ జంటలకు మోహన్ భగవత్ కీలక సూచన.. ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాల్సిందే!

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజ మనుగడ కోసం ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సంతానోత్పత్తి రేటుపై ఆసక్తికర విశ్లేషణ చేశారు.
సమాజంలో సంతానోత్పత్తి రేటు 2.1 కంటే తక్కువగా ఉంటే ఆ నాగరికత కాలక్రమేణా అంతరించిపోయే ప్రమాదం ఉందని భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వ్యక్తిగత సుఖాల కోసమే వివాహం కాదని, సృష్టిని ముందుకు తీసుకెళ్లడమే పెళ్లి ప్రధాన లక్ష్యమని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతానికి హిందువులకు ఎటువంటి ముప్పు లేకపోయినప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా కొత్తగా వివాహమైన జంటలు ఈ అంశంపై ఆలోచించాలని, జనాభా సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాలని ఆయన కోరారు. మత మార్పిడులను అరికట్టడంతో పాటు, అక్రమ చొరబాటుదారులను దేశం నుండి బహిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోహన్ భగవత్ ఉద్ఘాటించారు.