ముస్లిం సోదరులకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు.. గంగా జమున తహెజీబ్‌కు భాగ్యనగరం ప్రతీక అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: ఇస్లాం మతస్తులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదర, సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసం ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, నిరంతర దైవచింతనతో సాగే రంజాన్ మాసం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, అందునా హైదరాబాద్ నగరం ‘గంగా జమున తహెజీబ్’ (మత సామరస్యం)కు అద్దం పడుతుందని ఆయన కొనియాడారు.
రంజాన్ మాసం సందర్భంగా ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు మరియు సోదరభావం మరింతగా బలపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అల్లాహ్ కరుణాకటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.