హైదరాబాద్ రోడ్లపై చెత్త కనిపిస్తే అధికారుల పని ఖతం.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు శివారు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పారిశుధ్యంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. నగరంలో ఎక్కడైనా చెత్త కుప్పలు కనిపిస్తే సహించే ప్రసక్తే లేదని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన సీఎం, అవసరమైతే తానే స్వయంగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలకు వస్తానని స్పష్టం చేశారు.
ముఖ్యంగా సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల కమిషనర్లు ఏసీ గదులకే పరిమితం కాకుండా, ప్రతిరోజూ తెల్లవారుజామునే క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. నగర సుందరీకరణలో భాగంగా వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాన కూడళ్లలో ఎలక్ట్రిక్ కేబుళ్లు, సీసీ కెమెరాలు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులతో కూడిన ‘స్మార్ట్ పోల్స్’ ఏర్పాటును పరిశీలించాలని సూచించారు.
నగర పాలక సంస్థల ఆదాయ వనరుల పెంపుపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి మహానగరాల్లో ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయాన్ని అధ్యయనం చేసి, హైదరాబాద్‌లోనూ అదే తరహా విధానాలను అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రకటనదారులపై కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే వారిని వదలవద్దని పేర్కొన్నారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా ప్రైవేటు భాగస్వామ్యంతో మల్టీలెవల్ పార్కింగ్ సముదాయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా నెక్లెస్ రోడ్ పరిసరాల్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలపై నివేదిక కోరారు. అలాగే వీధి దీపాల నిర్వహణ కోసం అత్యాధునిక ‘యూనిఫైడ్ డిజిటల్ సిస్టమ్’ను తీసుకురావాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
మరో కీలక నిర్ణయంలో భాగంగా, కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లకు పరిపాలనా అంశాలపై అవగాహన కల్పించేందుకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశానికి తానే స్వయంగా హాజరై పట్టణాభివృద్ధిపై దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.