బెంగాల్ సాంస్కృతిక వైభవం పోయి బాంబుల సంస్కృతి రాజ్యమేలుతోంది, మమతా ప్రభుత్వంపై నిర్మలా సీతారామన్ ధ్వజం

పశ్చిమ బెంగాల్‌లోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితిపై లోక్‌సభ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఒకప్పుడు దేశానికే సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లిన బెంగాల్, ఇప్పుడు ‘బాంబుల సంస్కృతికి’ నిలయంగా మారిందని ఆమె విమర్శించారు. జీఎస్టీ విషయంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు మరియు పరిపాలనా వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. ఆర్థిక మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
కేంద్ర మంత్రి తన ప్రసంగంలో బెంగాల్‌లో ఇటీవల జరిగిన పలు దిగ్భ్రాంతికర సంఘటనలను ప్రస్తావిస్తూ మహిళా రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. బాంబు దాడిలో తమన్నా అనే యువతి మరణించడం, పెరుగుతున్న మహిళలపై అకృత్యాలే ఇందుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. వీటితో పాటు దుర్గాపూర్‌లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచార ఘటనను కూడా ప్రస్తావిస్తూ మమతా సర్కార్ తీరును తప్పుబట్టారు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో బెంగాల్ ప్రస్తుత దుస్థితిని ఆమె పార్లమెంటులో ఎండగట్టారు.