ప్రధాని మోదీ ఆహ్వానంతో భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు

ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఫిబ్రవరి 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ప్రధానంగా ‘హోరిజోన్ 2047’ రోడ్‌మ్యాప్ ఆధారంగా రక్షణ, వాణిజ్యం, సాంకేతికత మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక సహకారంపై ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మెక్రాన్ ముంబైని సందర్శించి, ప్రధాని మోదీతో కలిసి ‘భారత్-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026’ను ప్రారంభించనున్నారు. కొత్త సాంకేతికతలు, స్టార్టప్‌లు మరియు పర్యావరణ పరిరక్షణపై ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాలకు ఇది శ్రీకారం చుడుతుంది. అనంతరం ఫిబ్రవరి 19న న్యూఢిల్లీలో జరిగే ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’లో కూడా మెక్రాన్ పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్, ఫ్రాన్స్‌లు సాధించిన పురోగతిని ముందుకు తీసుకెళ్లడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం.