అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా వాడుకుంది, పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అమెరికా తన స్వార్థ ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వాడుకుని, అవసరం తీరాక ‘టాయిలెట్ పేపర్’ లాగా పక్కన పడేసిందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన, గతంలో రష్యాపై పోరాటానికి అలాగే 2001లో తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికాకు సహకరించడం పాకిస్థాన్ చేసిన అతిపెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఈ యుద్ధాల వల్ల పాకిస్థాన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని, అమెరికా కేవలం తమను ఒక సాధనంగా మాత్రమే వాడుకుందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
గత సైనిక పాలకులు జియావుల్ హక్, పర్వేజ్ ముషారఫ్ తీసుకున్న నిర్ణయాల వల్లే దేశం నేడు ఈ దుస్థితిలో ఉందని ఆసిఫ్ ఆరోపించారు. అమెరికా కోసం పాక్ తన గగనతలాన్ని, కరాచీ పోర్టును కూడా ఇచ్చిందని, కానీ ప్రతిఫలంగా దక్కింది శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్ల కారణంగా పాకిస్థాన్ సుమారు 75,000 మంది పౌరులను కోల్పోయిందని, 123 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు. అమెరికా నుండి అందిన నామమాత్రపు సాయం దేశానికి జరిగిన నష్టాన్ని ఏమాత్రం భర్తీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.