శుభలేఖలు పంచేందుకు వెళ్తుండగా విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకున్న ఆడి కారు

మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రీవా-ప్రయాగ్‌రాజ్ హైవేపై కోస్తా గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన ఆడి కారు ఒక బైక్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భగవత్ విశ్వకర్మ (55), అతని కుమారుడు శివం విశ్వకర్మ మరియు బంధువు శీతల్ విశ్వకర్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వచ్చిన కారు ఢీకొన్న ధాటికి బైక్ పై ఉన్నవారు గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారని, అనంతరం ఆ కారు డివైడర్‌ను ఢీకొట్టి ఆగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 24న భగవత్ పెద్ద కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పిలుపుల కోసం శుభలేఖలు పంపిణీ చేయడానికి బయలుదేరిన వారు, ఇంటికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆడి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్న పోలీసులు, డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి విచారణ జరుపుతున్నారు.