లక్నోలో ఘోరం, తెలిసిన ఆటో డ్రైవర్ మృగాడిగా మారి యువతిపై అఘాయిత్యం

లక్నోలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువతిపై ఒక ఆటో డ్రైవర్ మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు తన చెల్లితో కలిసి నిత్యం వెళ్లే మార్గంలో, తెలిసిన వ్యక్తి కావడంతో నిందితుడు కరణ్ సాహు ఆటో ఎక్కింది. మార్గమధ్యలో నిందితుడు బలవంతంగా కోల్డ్ డ్రింక్ తాగించడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీనిని అదునుగా తీసుకున్న నిందితుడు ఆమెను సతరిఖ్ ప్రాంతంలోని చక్సార్ అడవిలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి సమయంలో స్పృహ వచ్చిన యువతి తాను నిర్మానుష్య ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి భయాందోళనకు గురైంది.
ఘటన అనంతరం నిందితుడు ఆమెను బెదిరించి ఇంటి వద్ద వదిలి పరారయ్యాడు. బాధితురాలి మొబైల్ ఫోన్, బూట్లు మరియు ఇతర వస్తువులు ఘటనా స్థలంలోనే ఉండిపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తొలుత పోలీస్ స్టేషన్ పరిధి విషయంలో జాప్యం జరిగినప్పటికీ, చివరకు సతరిఖ్ పోలీసులు నిందితుడు కరణ్ సాహుపై కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాల కోసం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాధితురాలి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.