సామాన్యుడిపై పెట్రో భారం పడనుందా, రష్యా నుంచి చమురు నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

న్యూస్ డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనున్నాయా అనే ఆందోళన మొదలైంది. రష్యా నుంచి భారత్ చమురు కొనడం ఆపివేస్తుందని ప్రధాని మోదీ తనకు మాట ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనికి బదులుగా భారత్‌పై ఉన్న టారిఫ్‌లను తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే, భారత్ నుంచి తమకు అటువంటి సమాచారం ఏదీ అందలేదని రష్యా స్పష్టం చేసింది. చమురు దిగుమతుల్లో వచ్చే ఈ మార్పులు నేరుగా దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్ తక్కువ ధరకే రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ రష్యాకు బదులుగా ఇతర దేశాల నుంచి చమురు కొంటే, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. భారత్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించనప్పటికీ, ఆంక్షలు లేని దేశాల నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తామని వర్గాల సమాచారం. వెనిజులా వైపు భారత్ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నా, అది సామాన్యులకు ఎంతవరకు ఊరటనిస్తుందో వేచి చూడాలి.