ప్రేమను నిరాకరించినందుకు విద్యార్థినిపై దళిత విద్యార్థి కేసు నమోదు చేశారన్న వార్తలపై ఎస్ఆర్సీసీ స్పష్టత

శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) లో ఒక దళిత విద్యార్థి తోటి విద్యార్థినిని పెళ్లి చేసుకోమని కోరగా, ఆమె నిరాకరించడంతో కొత్త యూజీసీ ‘ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026’ కింద ఫిర్యాదు చేశాడనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిర్యాదు ఉపసంహరించుకోవడానికి సదరు విద్యార్థిని ₹50,000 చెల్లించిందని ఆ వీడియో సారాంశం. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు సాధారణ వర్గాల విద్యార్థులకు వ్యతిరేకంగా యూజీసీ నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారనే ప్రచారానికి ఇది తావిస్తోంది.
ఈ ఆరోపణలను ఎస్ఆర్సీసీ యాజమాన్యం పూర్తిగా ఖండించింది. కళాశాలలో ఇటువంటి ఘటన ఏదీ జరగలేదని, సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇవన్నీ సృష్టించారని పీఆర్ కోఆర్డినేటర్ హరీష్ కుమార్ స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టేందుకు యూజీసీ ఈ నిబంధనలను తెచ్చినప్పటికీ, తప్పుడు ఫిర్యాదుల నుంచి రక్షణ కల్పించే నిబంధనలు లేవన్న ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రస్తుతం వీటిపై స్టే విధించింది.