నూతన ఏడాది తొలిరోజే బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి రాజ్ నాథ్ సింగ్ ఎందుకు వెళ్లారు

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నూతన సంవత్సరం మొదటి రోజున న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ను సందర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్ పీ అధ్యక్షురాలు ఖలీదా జియా మరణం పట్ల సంతాపం తెలియజేసేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించి, సంతాప పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు మరియు ఖలీదా జియా కుటుంబ సభ్యులకు రాజ్ నాథ్ సింగ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీదా జియా డిసెంబర్ 30న ఢాకాలో కన్నుమూశారు. ఆమె మృతికి గుర్తుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. బుధవారం ఢాకాలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. భారత రక్షణ మంత్రి స్వయంగా రాయబార కార్యాలయానికి వెళ్లడం ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాల ప్రాముఖ్యతను చాటిచెబుతోంది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.