ముంబైలో అద్భుతం 5000 కిమీ దూరం నుండి రోబో సాయంతో డాక్టర్ విజయవంతమైన సర్జరీ

ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఒక అరుదైన వైద్య అద్భుతం చోటుచేసుకుంది. చైనాలోని షాంఘై నగరం నుండి దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి డాక్టర్ టి.బి. యువరాజ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా విజయవంతంగా సర్జరీ చేశారు. ‘తౌమాయ్’ రోబోటిక్ సిస్టమ్ ఉపయోగించి భారత్లో నిర్వహించిన మొట్టమొదటి క్రాస్-బార్డర్ రిమోట్ సర్జరీ ఇదే కావడం విశేషం. సంక్లిష్టమైన యూరాలజికల్ సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు ఈ విధానంలో చికిత్స అందించారు.
సిడిఎస్సిఓ అనుమతితో చేపట్టిన ఈ ప్రయోగం వైద్య రంగంలో కొత్త శకానికి నాంది పలికిందని ఆసుపత్రి సీఈఓ డాక్టర్ సంతోష్ శెట్టి తెలిపారు. ముంబై మరియు షాంఘైకి చెందిన వైద్య నిపుణులు, ఇంజనీర్ల సమన్వయంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ సాంకేతికత భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉన్న నిపుణులైన వైద్యులు మారుమూల ప్రాంతాల్లోని రోగులకు కూడా సులభంగా చికిత్స అందించేందుకు దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.