గాలిలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు ఒక పైలట్ దుర్మరణం

అమెరికాలోని న్యూజెర్సీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. హమ్మంటన్ మునిసిపల్ విమానాశ్రయం సమీపంలో రెండు హెలికాప్టర్లు గాలిలో ఉండగానే ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మరణించగా, మరో పైలట్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లలో పైలట్లు తప్ప ప్రయాణికులు ఎవరూ లేరు. ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మరియు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి. విమాన నిర్వహణ లోపాలు లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. సెనేటర్ కోరీ బుకర్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని మరియు దర్యాప్తు వివరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.