నిర్ణీత సమయం కంటే ముందే ఆఫీసుకు వచ్చినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు సమర్థించిన కోర్టు

స్పెయిన్‌కు చెందిన ఒక మహిళా ఉద్యోగిని తన ఆఫీసు సమయం కంటే ముందుగా వచ్చినందుకు యాజమాన్యం ఆమెను విధుల నుండి తొలగించింది. ఉదయం 7:30 గంటలకు రావాల్సి ఉండగా, ఆమె 40 నిమిషాల ముందే ఆఫీసుకు చేరుకునేవారు. యాజమాన్యం పలుమార్లు వారించినప్పటికీ ఆమె తన తీరు మార్చుకోకపోవడంతో, క్రమశిక్షణారాహిత్యం కింద ఆమెపై వేటు వేశారు. ముందే రావడం వల్ల సంస్థకు ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ ఆ మహిళ కోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. అలికాంటేలోని సామాజిక న్యాయస్థానం ఈ కేసులో సంస్థ నిర్ణయమే సరైనదని తీర్పునిచ్చింది. కంపెనీ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం క్రమశిక్షణ కిందకే వస్తుందని కోర్టు పేర్కొంది. స్పెయిన్ కార్మిక చట్టంలోని సెక్షన్ 54ను ఆమె ఉల్లంఘించారని, అందుకే ఆమెను తొలగించడం చట్టబద్ధమేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.