కేవలం 1500 మంది ఉన్న గ్రామంలో మూడు నెలల్లో 27 వేల మంది జననం! మహారాష్ట్రలో వెలుగుచూసిన భారీ కుంభకోణం

మహారాష్ట్రలోని షెందురుసాని గ్రామంలో విస్తుపోయే నిజం బయటపడింది. కేవలం 1500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో గత మూడు నెలల్లోనే 27,397 మంది పిల్లల జననాలు నమోదయ్యాయి. ఈ రికార్డులను పరిశీలించగా, ఇందులో మెజారిటీ పేర్లు పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవని తేలింది. ఇంత తక్కువ సమయంలో ఒక చిన్న గ్రామంలో వేల సంఖ్యలో జనన ధృవీకరణ పత్రాలు ఎలా జారీ అయ్యాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముంబై నుండి ఎవరో గ్రామ సిఆర్ఎస్ ఐడిని దుర్వినియోగం చేయడం ద్వారా ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఉదంతంపై ఐటి చట్టం మరియు భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదయ్యాయి. జిల్లా పరిషత్ సీఈఓ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నకిలీ పేర్లను వెంటనే రికార్డుల నుండి తొలగించాలని బిజెపి నాయకుడు కిరీట్ సోమయ్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు.