శీతాకాలంలో టోల్ టాక్స్ రద్దు? వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు

ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వచ్చే ఏడాది నుంచి అక్టోబర్ 1 నుండి జనవరి 31 వరకు టోల్ వసూలు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించింది. టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గితే కాలుష్యం తగ్గుతుందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. నిర్మాణ పనుల నిలిపివేతతో ఉపాధి కోల్పోయిన కార్మికుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయాలని మరియు వారి ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించింది.
కాలుష్యానికి శాశ్వత పరిష్కారం అవసరమని పేర్కొన్న ధర్మాసనం, పిల్లల ఆరోగ్యం దృష్ట్యా శీతాకాల సెలవులను ముందుగానే ప్రకటించే అంశాన్ని పరిశీలించాలని తెలిపింది. కార్మికులకు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. స్వచ్ఛమైన గాలి కోసం పటిష్టమైన విధానాన్ని రూపొందించాలని సూచిస్తూ, తదుపరి విచారణను జనవరి 6కి వాయిదా వేసింది.